మటన్ బిర్యానీ
 • 503 Views

మటన్ బిర్యానీ

కావలసినవి:

 • పచ్చి బొప్పాయి పేస్టు -2 టేబుల్ స్పూన్లు,
 • అల్లం వెల్లుల్లి పేస్టు - 3 టేబుల్ స్పూన్లు,
 • ఉప్పు - ఒక టీ స్పూన్,
 • పసుపు - పావు టీ స్పూన్


మ్యారినేట్ చేయడానికి:

 • పెరుగు- 300 ఎంఎల్,
 • ఉల్లిపాయలు -4,
 • కొత్తిమీర -2 కట్టలు,
 • పుదీన - ఒక కట్ట,
 • పచ్చిమిర్చి - 5(సన్నగా తరగాలి),
 • మిరప్పొడి -2 టీ స్పూన్లు,
 • ఉప్పు - ఒక టీ స్పూన్,
 • గరం మసాలా పౌడర్ - ఒక టీ స్పూన్,
 • ఏలకుల పొడి - పావు టీ స్పూన్,
 • నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు


బిర్యానీ కోసం:

 • బాస్మతి బియ్యం- ఒక కేజీ,
 • షాజీరా- అర టేబుల్ స్పూన్,
 • ఏలకులు - 2,
 • లవంగాలు - 2,
 • దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క,
 • బిర్యానీ ఆకులు - 2,
 • ఉప్పు - 5 టీ స్పూన్లు,
 • కుంకుమ పువ్వు - రెండు చిటికెళ్లు,
 • గోరువెచ్చని పాలు - ఒక కప్పు,
 • నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు,
 • తరిగిన కొత్తిమీర - అరకప్పు,
 • పుదీన ఆకులు - పావు కప్పు,
 • వేయించిన ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు,
 • నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు,
 • మైదా లేదా మరేదైనా పిండి - గిన్నెకి మూతకు మధ్య సీల్ వేయడానికి తగినంత పిండిని నీటితో చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి.

విధానం:

1. టెండరైజింగ్ మిక్స్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ కలపాలి. అందులో మాంసం ముక్కలను వేసి సమంగా పట్టేటట్లు కలిపి ఒకటిన్నర గంట సేపు పక్కన ఉంచాలి.టెండరైజింగ్‌అంటే ముక్కలను మెత్తబరిచేప్రక్రియ.

2. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలను దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి.

3. చిన్న పాత్రలో పాలను గోరువెచ్చగా చేసి అందులో కుంకుమపువ్వు వేసి పక్కన ఉంచాలి.

4. మరొక పాత్రలో మారినేటింగ్ కోసం తీసుకున్న పదార్థాలు, వేయించిన ఉల్లిపాయల్లో మూడు వంతులు తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని ముక్కలకు కలిపి రెండు గంటల సేపు నాననివ్వాలి. ఉల్లిపాయలు వేయించినప్పుడు మిగిలిన నూనెలో పావు కప్పు నూనెను ముక్కల మీద పోసి కలపాలి.

5. అడుగు భాగం వెడల్పుగా ఉన్న పాత్రను తీసుకుని లోపలి గోడలకు నెయ్యి రాయాలి. ఇప్పుడు మారినేట్ చేసిన మాంసాన్ని పలుచగా పరిచినట్లు అమర్చాలి.

6. మరొక పాత్రలో ఎసరు పెట్టి అందులో షాజీరా, ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉప్పు వేయాలి, ఎసరు మరిగేటప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి రెండు నిమిషాల సేపు ఉడకనిచ్చి వార్చేయాలి. సగం మేరకు ఉడికిన అన్నాన్ని ఒక కప్పు తీసి పక్కన ఉంచి మిగిలినదంతా మాంసం ముక్కలు పేర్చిన పాత్రలో ముక్కలకు పైన సర్దాలి. అన్నం పైన తరిగిన కొత్తిమీర, పుదీన, కుంకుమ పువ్వు కలిపిన పాలు, వేయించిన ఉల్లిపాయ ముక్కల్లో మిగిలిన పావు భాగాన్ని, నిమ్మరసాన్ని పలుచగా చల్లినట్లుగా సమంగా సర్దాలి. ఇప్పుడు కప్పులో తీసి ఉంచిన అన్నాన్ని పరిచినట్లు సర్దాలి. ఉల్లిపాయలు వేయించగా మిగిలిన నూనెను పావు కప్పు తీసుకుని అన్నం మీద వేయాలి. ఇప్పుడు పాత్రకు మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా అంచులను మైదాపిండితో పాత్రను, మూతను కలుపుతూ సీల్ వేయాలి.

7. ఆవిరి మొదలైన తర్వాత మంట తగ్గించి 20 నిమిషాల సేపు సన్నమంట మీద ఉడికించాలి.

గమనిక: చికెన్ బిర్యానీకి కూడా ఇదే పద్ధతి.