మిరపకాయ బజ్జీ
 • 379 Views

మిరపకాయ బజ్జీ

కావలసినవి:

 • మిరపకాయలు-10
 • కొబ్బరి తురుము-రెండు టీ స్పూన్లు
 • ధనియాలు-టీ స్పూన్
 • ఉప్పు-తగినంత
 • నువ్వులు-రెండు టీ స్పూన్లు
 • చింతపండుగుజ్జు-రెండు టీ స్పూన్లు
 • శనగపిండి-రెండు కప్పులు
 • బియ్యప్పిండి-రెండు కప్పులు
 • వంటసోడా-చిటికెడు
 • రిఫైన్‌డ్ ఆయిల్-డీప్ ఫ్రైకి సరిపడా
 • ఉల్లితరుగు-అరకప్పు
 • కొత్తిమీర-ఒక కట్ట

విధానం:

ముందుగా నువ్వులు, ధనియాలను వేయించి పక్కనపెట్టుకోవాలి.

తరువాత మిక్సీలో వేయించిన నువ్వులు, ధనియాలు, కొబ్బరితురుము, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండుగుజ్జు కలిపి ఆమిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

మిరపకాయలను మధ్యకి కట్‌చేసి గింజలను తీసేయాలి.

బాణలిలో అయిదారు గ్లాసుల నీరు, చిటికెడు ఉప్పు వేసి స్టౌ మీద పెట్టి నీరు మరిగిన తరువాత కట్ చేసి పెట్టిన మిరపకాయలను అందులో వేసి కాసేపు ఉడికించాలి.

కట్‌చేసి పెట్టిన మిరపకాయలలో పైన చేసిపెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి.

ఒక గిన్నెలో బియ్యప్పిండి, శనగపిండి, వంటసోడా, తగినంత ఉప్పు, నీరు పోసి గరిటజారుగా కలుపుకోవాలి.
బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత కలిపి పెట్టుకున్న పిండిలో మిరపకాయలను ముంచి నూనెలో వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకుని కాసేపటి తరవాత వేడి నూనెలో వేసి మళ్ళీ తియ్యాలి. అలా చేస్తే కరకరలాడతాయి.

ఉల్లిపాయ ముక్కల్లో నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి బజ్జీలను గార్నిష్ చెయ్యాలి.

హాట్ హాట్ మిరపకాయ బజ్జీ రెడీ.