సర్వపిండి అప్పాలు
 • 549 Views

సర్వపిండి అప్పాలు

కావలసినవి:

 • బియ్యప్పిండి - పావు కేజీ
 • ఉల్లికాడలు - నాలుగు
 • (కాడలు లేనప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి)
 • సొరకాయ తురుము - అర కప్పు
 • ఉప్పు - తగినంత
 • పచ్చిమిర్చి పేస్టు - టీ స్పూన్
 • శనగపప్పు - 50 గ్రా (రెండు గంటల సేపు నానబెట్టాలి)
 • నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
 • కొత్తిమీర - అర కట్ట (తరగాలి)
 • కరివేపాకు - రెండు రెమ్మలు (తరగాలి)
 • నువ్వులు - రెండు టీ స్పూన్లు

విధానం:

బియ్యప్పిండిలో పైన తీసుకున్న వాటిలో నూనె మినహా మిగిలిన అన్ని పదార్థాలనూ వేయాలి. తర్వాత తగినన్ని వేడి నీటితో చపాతీల పిండిలా కలుపుకోవాలి. మందంగా ఉండే అల్యూమినియం పాత్ర లోపలి అంచులకు నూనె రాయాలి. ఆ తర్వాత పిండి మిశ్రమాన్ని పాత్ర అంచులకు అంటేటట్లు అద్ది, పైన స్పూను నూనె వేసి సన్న మంట మీద కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత అప్పం గిన్నెను వదిలి ఊడి వస్తుంది. దాన్ని తీసి మరొక వైపుకు అమర్చి కాల్చాలి. ఈ అప్పం కాలేటప్పుడు గిన్నెకు మూత పెట్టకూడదు. అల్యూమినియం పాత్రకు బదులు స్టీలు పాత్ర వాడితే అప్పం కాలకముందే మాడిపోతుంది. నాన్‌స్టిక్‌లో అప్పం వచ్చినప్పటికీ రుచిగా అనిపించదు. అల్యూమినియం పాత్ర లేకపోతే బాణలిలో చేసుకోవచ్చు.